ఏపీలో సంక్రాంతి ముందే వచ్చింది

ఏపీలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు సీఎం జగన్. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 397.36 ఎకరాల్లోని లేఅవుట్‌ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఎకరాల్లో 12,301 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 28.30లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు.

‘300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది.  దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్‌లో పూర్తిగా ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం’ అని సీఎం జగన్ తెలిపారు.