పెళ్లి డేటు ప్రకటించిన సింగర్ సునీత
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనిని పెళ్లాడనుంది. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా జరిగాయి. పెళ్లి డేటుపై రకరకాల ప్రచారం జరిగింది. అయితే పెళ్లి డేటుని తానే స్వయంగా చెబుతానని ఓ ఇంటర్వ్యూలో సునీత తెలిపింది.
తాజాగా పెళ్లి డేటు ప్రకటించింది. జనవరి 9న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. బుధవారం తిరుమల దర్శనానికి వెళ్ళిన సునీత.. ఈ ఉదయం తన వివాహ తేదీని ప్రకటించింది. కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించానని కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యానని ఆమె పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా వుందని ఆమె పేర్కొంది.
సునీతకు 19 యేళ్ల వయసులోనే కిరణ్ తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త తీరుతో విసిగిపోయిన సునీత అతడితో విడాకులు తీసుకొంది. ఇక రెండో పెళ్లిపై సునీత స్పందిస్తూ.. ‘ప్రతితల్లి మాదిరిగానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలుకన్నాను.
అదే సమయంలో నేను సంతోషంగా ఉండాలని ఆశించే వివేకంతో ఆలోచించే తల్లిదండ్రులు, పిల్లలు నా తోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నేను ఆనందించే మధుర క్షణాలు వచ్చాయి. మంచి స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా రామ్ నా జీవితంలోకి ప్రవేశించారు. త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం’ అని తెలిపిన సంగతి తెలిసిందే.