ఇక జాతీయ రాజకీయాలకు కేసీఆర్.. సీఎంగా కేటీఆర్..!?
ప్రధాని నరేంద్ర మోదీపై తానెలాంటి అమర్యాదకర వ్యాఖ్యలు చేయలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను మార్చేస్తానంటూ ప్రకటించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశానికి తెరలేపి కాగ్రెస్ , బీజేపీ పార్టీలకు షాక్ ఇచ్చినంత పనిచేశారు సీఎం కేసీఆర్. బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అంటూ కాంగ్రెస్ విమర్శించినా కేసీఆర్ వ్యాఖ్యల వెనక అసలు కారణం వేరే ఉందనే చర్చ కూడా సాగుతోంది రాష్ట్రంలో.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, యాక్టింగ్ సీఎం గా మంత్రి కేటీఆర్ కు రాజకీయవర్గాల్లో ఒక పేరు వచ్చేసింది. 2019లో ఎట్టి పరిస్థితుల్లో తనయుడు కేటీఆర్ ను సీఎంగా చేస్తారని అందరూ ఊహించినప్పటికీ, ఎలా ఈ అంశాన్ని ప్రజల్లో నాటుతారనేది అందరికీ సంశయంగానే ఉండేది. గతంలో ఓ పత్రికా ఇంటర్వ్యూలో కూడా జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఇలాంటి పరిణామం ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదు కూడా.
తనదైన శైలిలో తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చ ర్చ జరిగేలా చేయడంలో కేసీఆర్ తరువాతే ఎవరైనా. ప్రస్తుతం ఎవరి వ్యూహంతో వారు 2019 ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమేనని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంతో పాటు కేటీఆర్ ను సీఎం చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు విశ్లేషకులు. అందుకోసం తెలంగాణ ప్రజలను ఇప్పటి నుంచే ఇందుకు సిద్ధం చేయడంతో పాటు, తాను జాతీయ రాజకీయాలకు వెళితే ఎలాగూ సీఎం కేటీఆరే కదా అనే టాక్ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఒక పద్దతి ప్రకారం తన రాజకీయ అనుభవంతో సమయస్పూర్తితో ముందుకు వెళుతున్నారు సీఎం కేసీఆర్.
ఇటు పార్టీలోనూ, ప్రజల్లోనూ ఒక మెసేజ్ వెళ్లేలా చేసి , ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నంలో భాగమే ఈ కామెంట్స్ వెనక అసలు ఉద్దేశమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.