గణతంత్య్ర దినోత్సవం రోజున కిసాన్ పరేడ్  

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు దఫాలుగా జరిగిన చర్చల్లో రైతుల ప్రధాన డిమాండ్లు అయిన మూడు సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ అంశాల్లో ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో ‘కిసాన్‌ పరేడ్’ పేరిట ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకుడు దర్శన్‌ పాల్‌ తెలిపారు.

అలాగే 23న ప్రతి రాష్ట్రంలో గవర్నర్ల నివాసాల వైపు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో 50 మంది రైతులు అమరులయ్యారని మరో నేత అశోక్‌ ధవాలే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 50 శాతం డిమాండ్లను అంగీకరించిందని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఒక్క హామీ కూడా లభించలేదన్నారు. ఇక ఈ నెల 4న రైతులతో మరోసారి కేంద్రం చర్చలు జరపనుంది.