30 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా వైరస్
మహమ్మారి కరోనా వైరస్ కు వాక్సీన్లు వచ్చేస్తున్నాయ్. ఇక కరోనా పీడ విరగడ కానుందని మురిసిపోతున్న సమయంలో కొత్త కరోనా వైరస్ లు వెలుగులోనికి వస్తున్నాయి. బ్రిటన్ లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కొత్త వైరస్ లు నాలుగు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. బ్రిటన్ లో వెలుగులోనికి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ ఏకంగా 30 దేశాలకు పాకింది.
తాజాగా వియత్నాంతో శనివారం తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన ఓ మహిళలో ఈ కొత్త రకం వైరస్ను గుర్తించారు. అంతకుముందు శుక్రవారం టర్కీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. వీరంతా యూకే నుంచి తిరిగొచ్చిన వారిగా గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఈ వైరస్ అమెరికాలో భారీగా వ్యాపించి ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్ లోకి కూడా కొత్త రకం వైరస్ ప్రవేశించింది. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త రకం కరోనా కేసులు నమోదయ్యాయ్. తెలంగాణలోనూ రెండు కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మొత్తానికి.. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచదేశాలని వణికిస్తోంది.