దేవాలయాలపై దాడుల వెనక ఉన్న పార్టీ ఏది ?

ఏపీ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయ్. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల వెనక బలమైన శక్తి ఒకటి ఉంది. అది రాజకీయ పార్టీ అనే ప్రచారం ఉంది. ఆ పార్టీ ఏది? అన్నది మాత్రం సస్పెన్స్. ఈ దాడుల వెనక తెదేపా హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని తెదేపా నేతలు సవాల్ విసురుతున్నారు. వైసీపీ నిర్లక్ష్య ధోరని వలనే దాడులు జరుగుతున్నాయని తెదేపా ఆరోపణలు చేస్తోంది.

మరోవైపు దేవాలయాలపై దాడుల వ్యవహారాన్ని భాజాపా, జనసేనలు సీరియస్ గా తీసుకున్నాయి. ఆందోళనకి రెడీ అవుతున్నాయి. అయితే ఈ దాడుల వెనక భాజాపా హస్తం ఉందని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు రాష్ట్రాల భాజాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నారాయణ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తెలంగాణ భాజాపా సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. వైసీపీ, టీడీపీలకు సీపీఐ తోకపార్టీలా మారిందని ఫైర్ అయ్యారు.

ఈ దాడుల వెనక పొలిటికల్ పార్టీ హస్తం ఉందని ఏపీ ప్రజలు కూడా భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏది అయి ఉంటుందని ప్రజలు కూడా తేల్చలేకపోతున్నారు. వైసీపీ శ్రేణులు తెదేపా నేతలే అని ఆరోపిస్తున్నాయ్. ఆ ఆరోపణలని తెదేపా శ్రేణులు తిప్పికొడుతున్నాయ్. సీపీఐ నారాయణ అయితే ఏకంగా హిందూత్వ పార్టీ భాజాపాపై బదనాం వేస్తున్నారు. మరీ.. దేవాలయాల దాడుల వెనక ఉన్న రాజకీయ పార్టీ ఏది ? అన్నది కాలమే తెలిపాలి.