వంద కోసం టాలీవుడ్ ఎదురు చూపులు
కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తిరిగి తెరచుకున్నాయి. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనుమతినిచ్చారు. సోమవారం తమిళనాడు ప్రభుత్వం అక్కడి సినీ ధియేటర్లలో 100 శాతం సీట్లు నింపుకునేలా అనుమతులు ఇచ్చింది. కరోనా తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడటం, సంక్రాంతి పండుగకు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ కి అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు, థియేటర్స్ యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు మంగళవారం తెలుగు సినీ నిర్మాతల మండలి తరఫున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 9 నుంచి సంక్రాంతి సినిమాల జోరు మొదలు కానుంది.
శుక్రవారం క్రాక్ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజుకో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ కి అనుమతులు ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. మరీ.. సినీ పరిశ్రమ విజ్ఝప్తిపై కేసీఆర్ సర్కారు ఓకే చేస్తుందా ? అన్నది చూడాలి.