సీఎం కేసీఆర్ టార్గెట్ అదేనా…?
మూడో ఫ్రంట్.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పడు పెద్ద చర్చకు దారితీశాయి. అందుకోసం ఆయన గట్టి చర్యలు కూడా ప్రారంభించారనే సంగతి జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. దేశ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టడంపై జాతీయంగా అధికార, విపక్ష పార్టీల నుంచి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఫోన్ లు చేసి మీవెంటే మేముంటామంటూ చెబుతోంటే, అధికార బీజేపీ మాత్రం కేసీర్ పగటి కలలు కంటున్నారంటూ విమర్శిస్తోంది. ఇక విపక్ష కాంగ్రెస్ అయితే ఇదంతా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కించడానికి సాగుతున్న డ్రామా అని, ఆ రెండు పార్టీలకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందమని గట్టిగానే విమర్శిస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ విమర్శలను పక్కనబెడితే.. అసలు థర్డ్ ఫ్రంట్ అనే అస్త్రం వెనక సీఎం కేసీఆర్ వ్యూహం ఏమిటనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఉన్న పార్టీలేవైనా ఎక్కువ ఎంపీలతో మద్దతిచ్చే వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయం గ్రహించిన కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ విజయవంతమవుతుందో లేదో అన్న విషయం పక్కనబెడితే ఈ ఫ్రంట్ ఆలోచనతో కేసీఆర్ పక్కాప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నారనేది స్పష్టమవుతోంది.
ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎలాగూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ధీమాతో ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని, ఇక సీఎం కేటీఆరే అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ల గలుగుతున్నారు, అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఎంపీలు ఎక్కువ ఉండాలనే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైబోలో భారత్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఇటు ఎమ్మెల్యే, అటు ఎంపీ సీట్ల పై కేసీఆర్ గురి పెట్టారని, ఇది ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. దీంతో ఎక్కువ సీట్లు పొందడంతో పాటు కాంగ్రెస్ బలం పుంజుకోకుండా చేయవచ్చనేది ఆయన ఆలోచనగా చెప్పుకుంటున్నారు.
మొత్తంమీద జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ విపక్షాల దృష్టి అటువైపు మళ్లేలా చేశారు. ప్రజలను తన వైపు ఆకర్షితులను చేసుకుంటున్నారు. ఎత్తులకు పై ఎత్తులకు వేస్తూ రాజకీయంలో చాణక్యుడిని తలపిస్తున్నారు. కేసీఆర్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి..