కీలకంగా మారనున్న ఈ బడ్జెట్ సమావేశాలు.. !
తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ గంట మోదింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కంటే ఈ బడ్జెట్ అధికార టీఆర్ఎస్ పార్టీకి మరింత కీలకం కానుంది. వచ్చే ఎన్నికలకు ఈ బడ్జెట్ కూడా ప్రధానం కానుంది. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహిస్తారు, బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఏ అంశాలకు ఉంటుందనే చర్చ మొదలైంది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, వాగ్ధానాలకు సంబంధించి గత బడ్జెట్ తో పోల్చి విపక్షాలు కూడా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. కాబట్టి అందరి చూపు ఈ బడ్జెట్ సమావేశాల వైపు మళ్లింది.
టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలులో బడ్జెట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రతీ ఏటా కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినా ఇది చివరి బడ్జెట్ కావడంతో అందరి దృష్టీ ఈ బడ్జెట్ సమావేశాలపైనే ఉండనుంది. ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఏ అంశానికి ఈ సారి ఎక్కువ ప్రాధాన్యతనివ్వనున్నారు అనే ఆసక్తి అటు అధికార,ఇటు విపక్ష నేతల్లో నెలకొంది.
ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమంటూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పేదింటి కళ డబుల్ బెడ్రూం పై కూడా ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి. ఆరోగ్యానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా పెద్దాసుపత్రుల నిర్మాణం చేపడతామని గతంలో అధికార పార్టీ చెప్పింది. అయితే అది కూడా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని కులాలకు సంబంధించి మాత్రమే న్యాయం చేకూర్చారన్న విమర్శ ఉంది. మిగతా కులాల సంక్షేమం, ఉపాధికి సంబంధించి ఈ బడ్జెట్ లో చోటు ఉంటుందని భావిస్తున్నారు చాలామంది. ఇక రైతు సంక్షేమానికి సంబంధించి ఈసారి రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని బావిస్తున్నారు. రైతులందరికీ ఎకరానికి నాలుగువేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఈ బడ్జెట్ ను రూపొందిస్తున్నారనే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. వీటన్నింటితో పాటు ఇతర శాఖల కు సంబంధించి బడ్జెట్ రూపకల్పన చేస్తే ఈసారి ఎంత బడ్జెట్ ప్రవేశపెడతారనే ప్రశ్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
బడ్జెట్ కేటాయింపుల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి విమర్శనాస్త్రాలు సిద్ధం చేసుకోననున్నాయి విపక్షాలు. అధికార పార్టీ ఎన్నికల హామీలు, అమలును ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి. మొత్తం మీద ఈ ఎలక్షన్ ఇయర్ లో మొదలైన బడ్జెట్ సమావేశాలు, ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇటు అధికార పార్టీకి, అటు విపక్ష పార్టీలకు కీలక అస్త్రంగా మారనుంది.