ఏపీ ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేష్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని కామెంట్ చేశారు. శ్రీకాకుళంలో వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవంలో కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక తమని పట్టించుకోవడం లేదని పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. వారికి న్యాయం చేస్తాం. ఇప్పటికే గ్రామ వాలంటీర్లుగా వైకాపా కార్యకర్తలను నియమించామని చెప్పుకొచ్చారు.
ధర్మాన చేసిన వ్యాఖ్యల్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పార్టీ కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని.. అదే నిజమైతే పార్టీ గ్రాప్ తగ్గుతున్నట్టే. ఆ ఎఫెక్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పడే అవకాశాలున్నాయి. రెండోది.. గ్రామ వాలంటీర్లుగా వైకాపా కార్యకర్తలను నియమించాం అనడం. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గ్రామ వాలంటీర్లు వైకాపా కార్యకర్తలని. ఇప్పుడు ఆ ఆరోపణలని కృష్ణదాస్ ఒప్పుకున్నట్టయింది.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆరు నెలల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జాబ్‌మేళాను నిర్వహిస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే నెలలో స్థానిక సంస్థ ఎన్నికలు రావొచ్చని విజయసాయి హింట్ ఇచ్చారు.