అధీర.. అతి క్రూరుడు !

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్‌ 2’. శ్రీనిధి శెట్టి కథానాయిక. సంజయ్ దత్, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సంజయ్ దత్ అధీర పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 2 అనుభవాలని పంచుకున్నారు సంజయ్ దత్.

“ప్రశాంత్‌నీల్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. సెట్‌లో ఆయన చాలా కూల్‌గా ఉంటారు. తొలిసారి ప్రశాంత్‌ దర్శకత్వంలో పనిచేసినా, చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినిమాపై ఆయనకున్న ఎన్నో ఆలోచనలను నాతో పంచుకున్నారు. అంతేకాదు, ప్రశాంత్‌ దర్శకత్వం శైలి నేను ఎన్నో నేర్చుకునేలా చేసింది.

నా కెరీర్‌లో చాలా రకాలు పాత్రలు పోషించా. అయితే, అధీర పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశా. దయాదాక్షిణ్యాలు లేని అతి క్రూరుడు అధీర. అధీర పాత్ర చాలా బలంగా ఉంటుంది. మేకప్‌ వేసుకోవడానికే గంటన్నరకు పైగా పట్టేది. నేను గతంలో పోషించిన పాత్రలకు ఇది చాలా భిన్నమైంది” అని చెప్పుకొచ్చారు.