ఎన్నికలు రద్దుపై.. ఎన్నికల సంఘం రియాక్షన్ !
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. మూడ్రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేసింది. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజారోగ్యం, కోవిడ్ వ్యాక్సినేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో మంగళవారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఎస్ఈసీ నిర్ణయించింది. వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను కోర్టుకు వివరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండగా, మరోవైపు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని వైసీపీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది.
రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భాల్లేవని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎన్నికలని నిర్వహించేందుకు పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేసినా.. కోర్టు దానికి సపోర్ట్ చేయలేదు. అది ఎన్నికల సంఘం పరిధిలోనిది అని చెప్పింది. మరీ.. ఏపీలోనూ కోర్టు తీర్పు ఎలా ఉండనుందని అనేది ఆసక్తిగా మారింది.