స్మిత్.. ఛీటర్ !


ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. పంత్‌ తన బ్యాటింగ్‌కు అనువుగా క్రీజులో చేసుకున్న గార్డ్‌ మార్క్‌ను స్మిత్‌ చెరిపివేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సోమవారం ఆటలో రెండో సెషన్‌లో ఆటగాళ్లు డ్రింక్స్‌ బ్రేక్‌కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్‌ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్‌ చేసుకున్న మార్క్‌ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా బెయిల్స్‌ కెమెరాకు చిక్కింది. ఈ వీడియోలో వైరల్ అవుతోంది. స్మిత్ చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిజాయతీగా ఆడాలని ప్రయత్నించకుండా, విజయం కోసం మరోసారి అడ్డదారులు తొక్కుతున్నావా అని స్మిత్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ స్మిత్, వార్నర్‌పై 12 నెలలు; బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. ఇక మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.