TSలో ఫిబ్రవరి1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కరోనా వాక్సీన్ కూడా వచ్చేసింది. ఈ నెల 16 నుంచి వాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మునుపటి పరిస్థితులు ఏర్పాటు కానున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి విద్యాసంస్థలని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 18 నుంచి ఏపీలో స్కూల్స్ రెండుపూటలా నడవనున్నాయ్.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థల ప్రారంభం పై నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు.
సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.