టీకా పంపిణీ ప్రారంభం.. రెండో డోస్ మరిచిపోవద్దు !


కరోనా టీకా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘”కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశమంతా ఎదురుచూసింది. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ అడిగారు. ఆ రోజు వచ్చేసింది. ఈ సందర్భంగా టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నా. వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది” అని ప్రశంసించారు.

‘టీకా తీసుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే తొలి హక్కుదారులు. కరోనాను ఎదుర్కొనేందుకు రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రెండు డోసులకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచించారు. అందువల్ల రెండో డోసును మర్చిపోవద్దు. అంతేగాక, తొలి డోసు వేసుకున్నాక కూడా మాస్క్‌లు,భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే రెండో డోసు వేసుకున్న తర్వాతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది’ అని మోదీ వివరించారు.