హైదరాబాద్ లో నిర్భంధ కాండ..!
హైదరాబాద్ ట్యాంక్ బండ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. టీజేఏసీ మిలియన్ మార్చ్ స్పూర్తి సభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వివిధ ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు. తెలంగాణ పోలీసులు టీజేఏసీ సభకు అనుమతి నిరాకరించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో సభను జరిపి తీరతామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రూఫ్ టాప్ వాచ్ తో పాటు, ట్రాఫిక్ ను దారి మళ్లించారు పోలీసులు. శివార్లతో కలిపి మొత్తం 350 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఓయూతోపాటు కొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అశ్వక దళాలు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను మోహరించారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చే వారిని అడ్డుకునేందుకు హైదరాబాద్ కు వచ్చే అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు పలువురు జేఏసీ నేతల ఇళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. కోదండరాంను హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు బయలుదేరేందుకు ప్రయత్నించిన కోదండరాంను సొంతవాహనంలోనే స్టేషన్ కు తరలించారు. కోదండరామ్ డ్రైవర్ ను దింపి వాహనం స్వాధీనం చేసుకుని, పోలీస్ డ్రైవర్ సాయంతో బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.