జనసేన సభకు విద్యార్థిసైనికులు..!!
మార్చి 14 నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది ఆ పార్టీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వేలాదిమంది కార్యకర్తలు హాజరవుతారని అంచానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు వారి భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది జనసేన పార్టీ.
సభకు హాజరయ్యే కార్యకర్తలు మరియు అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కృష్ణా,గుంటూరు జిల్లాలకి చెందిన 200 మంది విధ్యార్ధులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (B.L.S.) శిక్షణ ఇస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. మార్చి 11వ తేది (ఆదివారం) నాడు ఉదయం 10 గంటల నుంచి విజయవాడలోని సభా సమన్వయ కార్యాలయంలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో శిక్షణా శిబిరం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మార్చి 11న అక్కడికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు భద్రతతో పాటు సొంతంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది జనసేన పార్టీ. సభకు హాజరయ్యే వారి సంరక్షణ చర్యలు చేపట్టడానికి విద్యార్ధులను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతన్నాయి.