కరోనా వాక్సిన్ తీసుకున్న ఇద్దరు మృతి

ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాక్సిన్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే ఓ ఆరోగ్య కార్యకర్త మృతిచెందాడు. అయితే, ఆయన కరోనా టీకా తీసుకోవడం వలన మృతి చెందలేదు. ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్‌–డి ఉద్యోగి నాగరాజు (43) కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న రెండో రోజు మరణించాడు. అయితే ఈ మరణం హార్ట్‌ అటాక్‌ వల్ల వచ్చిందని, వ్యాక్సినేషన్‌ వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పోస్ట్‌ మార్టం వరకూ ఆగాల్సి ఉంటుందన్నారు.

ఈ ఘటనలు తప్ప.. వాక్సిన్ తీసుకున్న వారిలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని చెబుతున్నారు. అయితే వాక్సిన్ తీసుకున్నవారిలో కొందరికి దురద, స్వల్పంగా జ్వరం రావడం జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి స్వల్ప లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు ముందు నుంచే చెబుతున్నారు. కాబట్టి బటయపడాల్సిన అవసరం లేదు.