సెంచరీ దాటిన తర్వాత స్పీడు పెంచిన పుజారా !!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారుతోంది. 328 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ (73*) తోడుగా పుజారా (15* 105 బంతుల్లో) ఆటను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచాడు. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ టిమ్‌పైన్‌కు చిక్కడంతో 18 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది.
జిడ్డుకు మారుపేరైనా నయా వాల్ పుజారా 90 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంచ్ తర్వాత పుజారా కాస్త స్పీడు పెంచడం గమనార్హం. తొలి ఫోర్ కొట్టి కాస్త ఊపులోకి వచ్చాడు. దాదాపు 100 బంతులు ఆడిన తర్వాత.. అంటే పుజారాలో ఊపు వచ్చిందన్న మాట. దీంతో.. బంతులు సెంచరీ దాటిన తర్వాత పుజారా స్పీడు పెంచాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 226 పరుగులు కావాలి. టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని ముద్దాడితే.. చరిత్రే.