కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కేటీఆర్ లేఖ
కేంద్ర కుటుంబ సంక్షేమ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో బయోటెక్ కంపెనీలు ఏటా ఆరు బిలియన్ల (600 కోట్లు) డోసుల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్ డోసుల్లో మూడోవంతు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా 80 దేశాలకు చెందిన రాయబారులు హైదరాబాద్‌లో పర్యటించి వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో చర్చించి, తయారీపై వివరాలు అడిగి తెలుసుకున్నారని లేఖలో గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ ఉందని.. ప్రతిసారీ అక్కడకు వ్యాక్సిన్లను పంపించి సర్టిఫికేషన్ పొందేందుకు హైదరాబాద్ కంపెనీలకు చాలా సమయం పడుతోందని కేటీఆర్ హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోల్‌కతా, ముంబయి, చెన్నై, కర్నాల్‌లో మాత్రమే ఉన్న ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని కోరారు.