అమెరికా కొత్త అధ్యక్షుడు తొలి ట్విట్
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. డెమొక్రాటిక్ నేతలు జో బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ వెలుపల ఏర్పాటు చేసిన వేదికపై 78ఏళ్ల బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా 56ఏళ్ల కమలా హారిస్ బాధ్యతలు చేపట్టారు.
అధ్యక్షుడి హోదాలో బైడెన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ”సమయాన్ని వృథాకానివ్వను ” అంటూ తొలి ట్వీట్ చేశారు. ”ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కరించాలంటే సమయాన్ని వృథా చేయకూడదు. అందుకే ఈ రోజే నేను ఓవల్ ఆఫీస్కు వెళ్లి పని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. అటు ప్రమాణస్వీకారం అనంతరం కమలాహారిస్ కూడా ట్విటర్లో స్పందిస్తూ.. ”సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.