రైతు నేతల సంచలన ఆరోపణ

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 26న రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారు. అందులో భాగంగా మమల్ని చంపేందుకు కుట్ర చేశారు. శుక్రవారం రాత్రి ముసుగు వేసుకొని వచ్చిన ఓ వ్యక్తిని పట్టుకొన్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు. అతడిని మీడియా ముందు ఉంచారు.

ఆ పట్టుబడిన వ్యక్తి మాట్లాడుతూ.. “‘జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించకున్నాం. ఒకవేళ వారు ఆగకపోతే.. తొలుత గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాం. తర్వాత మా బృందంలోని మరికొంత మంది సభ్యులు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న దిల్లీ పోలీసులు.. రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురుకాల్పులు జరుపుతారు” అని చెప్పుకొచ్చాడు.

అయితే దీనిపై స్పందించిన దిల్లీ పోలీసులు.. తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని పేర్కొన్నారు.