వైసీపీ ఎమ్మెల్యే ఓటమి బాధ్యత తీసుకున్న పవన్

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. డిసెంబరు 16న కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిపై జనసేన కార్యకర్త వెంగయ్య ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగడంతో కంగుతున్న జనసేన కార్యకర్త ఎమ్మెల్యేకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాజాగా వెంగయ్య కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ.. ‘ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ, పేదల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు.