టాలీవుడ్ Vs మీడియా.. స‌యోధ్య కుదిరేనా..?!

గ‌త కొంత కాలంగా తెలుగు సినిమా రంగానికి, మీడియాకి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా పెద్ద యుధ్ద‌మే న‌డుస్తోంది. శ్రీ రెడ్డి అంశంతో మొద‌లైన ఈ ర‌చ్చ‌.. మీడియాపై ప‌వ‌న్ కామెంట్స్ తో చినికి చినికి గాలివాన‌లా మారింది. అది ఎంత‌లా అంటే ఫ‌లానా మీడియాను బ్యాన్ చేయాలి అంటూ ట్వీట్స్ పెట్టే స్థాయికి చేరుకుంది. ఏకంగా సినీ పెద్ద‌లే మీడియాను బ్యాన్ చేసే అంశంపై ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని సినీ పెద్ద‌లు భావిస్తున్నారు. ఇందుకోసం అల్లం నారాయణ నేతృత్వంలోని టియుడబ్ల్యూజె రంగంలోకి దిగింది. బెదిరించి, బ్యాన్ చేసి మీడియాను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దని, వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ సినీ పెద్దలకు సూచించారు. ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పరిశ్రమ తరపున సురేష్ బాబు, అల్లు అరవింది, కె ఎల్ నారాయణ, ఎన్ శంకర్ లు హాజరయ్యారు.

రెండు గంటల పాటు సాగిన సమావేశంలో గత నెల రోజులుగా మీడియా కు సినీ పరిశ్రమకు ఏర్పడ్డ స్పర్థలపై చర్చించారు.. మీడియా ప్రసారాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని మీడియా దృష్టికి తీసుకురావాల్సింది కానీ బెదిరిస్తే కుదరదు అని సినీ ప్రముఖులకు జ‌న్న‌లిస్టు నేత‌లు తేల్చిచెప్పారు. దీంతో మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచన తమకు లేదని మీడియా తో స్నేహపూర్వకంగానే వుంటున్నామని అయితే కొన్ని మీడియా ల వల్ల సినీపరిశ్రమ పై ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మీడియా పెద్దలతో త్వరలో సమావేశం అవుతామని స్నేహపూర్వకంగానే సమస్యను పరిష్కరించాలని తాము కూడా అనుకుంటున్నామని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. చూడాలి మ‌రి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేందుకు ఇంకెంత‌కాలం ప‌డుతుందో..