రైతన్నలకు సెల్యూట్ చేసిన రాష్ట్రపతి
రైతన్నలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెల్యూట్ చేశారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం భారత్ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. దేశానికి రైతాంగ సేవలు శ్లాఘనీయమని కొనియాడారు.
కరోనా వైరస్‌ను దేశం దీటుగా ఎదుర్కొందని, మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. కరోనా మహమ్మారితో ముందువరుసలో నిలిచి పోరాడిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల సేవలు మరువలేనవని కొనియాడారు.
మన సరిహద్దులపై విస్తరణ కాంక్షతో జరిగిన ఘటనలను అధిగమించామని గుర్తుచేశారు. సరిహద్దులను కాపాడే క్రమంలో 20 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వీరసైనికుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.