సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్ న్యూస్
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కరోనా వాక్సీన్ పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది. అదే సమయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల ఓపెనింగ్ నిబంధనని సడలించింది. ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని తెలిపింది.
కేంద్రం జారీ చేసిన తాజా గైడ్ లైన్స్ :
* గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని తెలిపింది.
* కేవలం క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని పేర్కొంది.
* కంటైన్మెంట్ జోన్ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి
* కేవలం బిజినెస్ తరహానే కాకుండా అన్ని రకాల ఎగ్జిబిషన్ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.
* అంతర్జాతీయ విమాన సర్వీసులపై పౌర విమానయాన శాఖ కేంద్రహోం శాఖతో పరిస్థితులపై సమీక్షించి నిర్ణయం
* సామాజిక/ఆధ్యాత్మిక/క్రీడా/ వినోద/విద్యా/సాంస్కృతిక సంబంధిత సభలు, సమావేశాలకు హాలు సామర్థ్యంలో 50శాతం (లేదా 200మంది మించరాదు) వరకు గతంలో అనుమతించిన కేంద్రం.. తాజాగా ఆ పరిమితిని సడలించింది. దీనిపై ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం కల్పించింది.
* ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు
* 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది