గుడ్ న్యూస్.. త్వరలోనే నిరుద్యోగభృతి !
తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించవచ్చన్నారు. అంటే.. వచ్చే నెలలోనే నిరుద్యోగ భృతిపై ప్రకటన రావొచ్చన్న మాట. ఎందుకంటే ? వచ్చే నెల 18న మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నిరుద్యోగభృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పడంతో… అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. ఇక ఇప్పటికే లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇటీవల పీఆర్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 50వేల ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా పోలీస్ (20వేలు), విద్యా శాఖ(10వేలు) కు సంబంధించిన ఉద్యోగాలే ఉన్నాయని తెలుస్తోంది.