కరోనా వాక్సిన్ తీసుకున్న 5గురు డాక్టర్లకి కరోనా
జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలివిడతలో కరోనా వారియర్స్ కి వాక్సిన్ ఇస్తున్నారు. అయితే కర్నాటకలో కరోనా వాక్సిన్ తీసుకున్న ఐదుగురు డాక్టర్లకి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కరోనా టీకాను తీసుకున్న తరువాత మహమ్మారి బారిన పడటంతో తీవ్ర సంచలన రేగింది.
తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. ఈ డాక్టర్లు 40నుంచి 50 ఏళ్ల వారు కావటం గమనించాల్సిన విషయం. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు.