మెట్రోలో ‘గుండె’ తరలింపుపై ప్రశంసలు
బుధవారం మెట్రో రైలులో నాగోలు స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గుండె తరలింపునకు మెట్రో అధికారులు సహకరించిన విషయం తెలిసిందే. దీనిప్రై సర్వాత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు గుండెను 21 కిలోమీటర్ల దూరం ప్రత్యేక రైలును నడపడం హర్షించదగ్గ విషయమన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డిది పేదకుటుంబం. బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్ అయినట్లు ధ్రువీకరించారు.
జీవన్‌దాన్ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. ‘మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని’ వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు.
Hyderabad Metro Turns Lifeline, Transports Heart For Transplant #Hyderabad #Metro #NTVNews #NTVTelugu pic.twitter.com/bDateryM61
— NTV Telugu (@NtvTeluguLive) February 3, 2021