షాకింగ్ : ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనా వైరస్’లు

మహమ్మారి కరోనా ఉదృతి ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. వాక్సిన్లు కూడా అందుబాటులోకి రావడంతో.. ప్రపంచానికి కరోనా పీడ విరగడ అవ్వనుందని భావించారు. కానీ ఇంతలో కొత్త రకం కరోనా వైరస్ లు పుట్టుకొచ్చాయ్. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్త రకం వైరస్ లు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్తరకం వైరస్ ఇప్పటికే 83 దేశాలకు పాకింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. బ్రిటన్ లో ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనా వైరస్ లని గుర్తించారు. ఇలాంటి కేసులు అక్కడ రెండు నమోదయ్యాయ్. ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు ఇవేనని భావిస్తున్నారు. ఇలాంటి కేసులు చాలా డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు దక్షిణ బ్రెజిల్ లోని రియో గ్రాండే సూల్ ప్రాంతంలోని 90 మంది కరోనా రోగుల తెమడను(moisture) పరీక్షించిన ఫీవేల్ వర్సిటీ పరిశోధకులు ఈ డబుల్ ఇన్ఫెక్షన్ కేసులను గుర్తించారు. వారిలో ఏకకాలంలో రెండు కరోనా రకాలు పాజిటివ్ గా తేలడం పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తిలో కనిపించిన రెండు కరోనా రకాలను బ్రెజిల్ లోనే రూపు మార్చుకున్న పీ1, పీ2గా గుర్తించారు. వీటిలో పీ1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ అని భావిస్తున్నారు. ఇది వ్యాక్సిన్ కు కూడా లొంగకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు రకాల వైరస్ కనిపించిన వ్యక్తుల్లో పొడి దగ్గు(dry cough), తలనొప్పి(headache), గొంతు మంట(sore throat) లాంటి స్వల్ప లక్షణాలు కనిపించాయి.