ఆదిపురుష్’లో ఆర్ఆర్ఆర్ నటుడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్.  ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ ని తెరకెక్కించనున్నట్టు సమాచారమ్. బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో శివుడుగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించనున్నారట.

ఓంరౌత్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటించిన ‘తన్హాజీ’ చిత్రం గతేడాది బాలీవుడ్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఓం రౌత్‌తో చాలా సన్నిహిత సంబంధాలుండడంతో ఆ పాత్రను చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అజయ్ దేవగణ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ తో తెలుగు ప్రేక్షకులని అలరించనున్నారు.

ఇక ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తుండగా.. తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేయనున్నారు. చిత్రంలో సీత పాత్రకు బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. బుధవారం నుంచే ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. తొలిరోజు షూటింగ్ లోనే సెట్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.