సోము సెల్ఫ్ గోల్.. పవన్’కు లైన్ క్లియర్ !

‘రాజకీయాల్లో హత్యలు ఉండవ్. ఆత్మహత్యలే ఉంటాయ్’ అంటుంటారు. ఇప్పుడు ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఇలాంటి పనే చేశారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. ఆ దమ్ము తెదేపా, వైసీపీలకు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆ రెండు పార్టీలు ఏమీ నొచ్చుకోలేదు. కానీ భాజాపా దోస్తానా పార్టీ జనసేన నొచ్చుకుంది. భాజాపా-జనసేన కూటమి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అని జనసేన గట్టిగా నమ్ముతోంది.

ఈ నేపథ్యంలో సోము చేసిన వ్యాఖ్యలు పవన్ సీఎం అభ్యర్థి కాదు అన్నట్టుగా ఉన్నాయని జనసేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్, సోము ఇద్దరు కాపులే. అలాంటప్పుడు సోము బీసీ సీఎం ఎత్తడం వెనక.. పవన్ టార్గెట్ చేయడమేనని జనసేన సీరియస్ అవుతోంది. సోము కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. బీసీని సీఎంగా చేస్తానని తాను అనదు. అసలు, రాష్ట్రానికి సీఎంను నిర్ణయించే అధికారం తనకు లేదు. అది బీజేపీ హైకమాండ్ పరిధిలోని విషయం. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై నిర్ణయం తీసుకుంటారని మరింత వివరణ ఇచ్చారు.

ఈ వివరణతో సోము సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయింది. పవన్ కు ప్లస్ కానుంది. ఇన్నాళ్లు ఏపీలో భాజాపా-జనసేన కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అవుతారనే సస్పెన్స్ ఉండేది. దీనిపై సోము కాస్త క్లారిటీ ఇచ్చినట్టుంది. ఏపీ భాజాపా సీఎం అభ్యర్థి ఎన్నిక భాజాపా అధిష్టానంతో పాటు పవన్ కల్యాణ్ చేతుల్లోనే ఉందని సోము స్పష్టతనిచ్చినట్టయింది. ఇంకా చెప్పాలంటే.. భాజాపా-జనసేన సీఎం అభ్యర్థి పవన్ అని ఎక్స్ ప్లోర్ కావడానికి సోము అవకాశం ఇచ్చేశారు. అయినా.. ఆలు లేదూ.. సూలు లేదు.. అప్పుడే కొడుకు పేరు రామలింగం అన్నట్టు.. ఇప్పుడి నుంచే భాజాపా-జనసేనల మధ్య సీఎం కుర్చి కొట్లాటలేంటో.. !!