ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ విరాళం

ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలప్రళయం సంభవించిన విషయం తెలిసిందే. ఈ జల ప్రళయంలో ఇప్పటికే 14 మంది మృతిచెందగా సుమారు 170 మంది గల్లంతయ్యారు. ఆదివారం అర్థరాత్రి వరకు సాగిన సహాయక కార్యక్రమాలు.. ఈ ఉదయం తిరిగి ప్రారంభం అయ్యాయ్. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది. టీమిండియా మాజీ, తాజా ఆటగాళ్లు ఈ ఘటనపై స్పందించారు.

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ అడుగు ముందుకేసి.. వరద బాధితులను కాపాడేందుకు తనవంతుగా మ్యాచ్‌ ఫీజును వితరణగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఉత్తరాఖండ్‌లో అనూహ్యంగా సంభవించిన వరదల కారణంగా తమ వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆశిస్తున్నా. ఈ దుర్ఘటన ఎంతో కలచివేసింది. బాధితులను కాపాడేందుకు నా వంతుగా మ్యాచ్‌ ఫీజును విరాళంగా ఇవ్వదల్చుకున్నానని పంత్ ట్విట్ చేశారు. ఇక సురేష్ రైనా, సెహ్వాన్, వివి ఎస్ లక్ష్మణ్ తదితరులు ఉత్తరాఖండ్ ఘటనపై స్పందించారు.