ఎర్రకోట ఘటన.. నటుడు దీప్‌సిద్ధూ !
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై రైతు జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. రైతు జెండాతో పాటు సిక్కుల జెండాని కూడా ఎగరవేశారు. దీని వెనక పంజాబ్ నటుడు దీప్ సిద్ధూనే కారణమనే ఆరోపణలున్నాయి. రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నారు. జెండాలు ఎగురవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా చేశారు. అల్లర్లకు సిద్ధూనే బాధ్యుడంటూ రైతు సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే ఆ తర్వాత నుంచి సిద్ధూ కన్పించకుండా పోయారు.
ఆయన కోసం పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు. ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. అయితే ఫైనల్ గా సిద్ధూని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీప్ సిద్ధూను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ సంజీవ్ కుమార్ యాదవ్ తాజాగా తెలిపారు. సిద్ధూ ఇన్నాళ్లు అజ్ఝాతంలో ఉన్నప్పటికీ.. ఫేస్‌బుక్‌లో సిద్ధూ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వీడియోలను విదేశాల్లో ఉంటున్న సిద్ధూ స్నేహితురాలు ఒకరు పోస్ట్ చేసినట్లు తెలిసింది.