ఆజాద్’కు వీడ్కోలు : కన్నీళ్లు పెట్టుకున్న మోడీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు వచ్చేవారం పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్‌కు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యారు.
“ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి. నాకు ఆజాద్ ఎంతోకాలంగా తెలుసు. నేను గుజరాత్‌కు సీఎం కాకముందు నుంచీ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు నాకు ముందు ఫోన్ చేసింది ఆజాదే. ఆ రాత్రి నాకు ఫోన్ చేసి దాడి గురించి చెబుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
అప్పుడు ప్రణబ్ ముఖర్జీ రక్షణమంత్రిగా ఉన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల మృతదేహాలను గుజరాత్‌కు తరలించాలని ప్రణబ్‌దా భారత వాయుసేనను కోరారు. ఆ తర్వాత ఆజాద్ మళ్లీ ఫోన్ చేసి నేను ఎయిర్‌పోర్టులో ఉన్నానని చెప్పారు. ఆయన నాకు నిజమైన స్నేహితుడు. ప్రతి ఒక్కరినీ ఆయన తన కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత లేరని కొనియాడారు. కేవలం పార్టీ కోసమే గాక, సభ.. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రశంసలు కురిపించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం” అని మోదీ తెలిపారు.