వారి చేతిలో మోసపోయిన సీఎం కూతురు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురుని సైతం బురిడికొట్టించారు సైబర్ నేరగాళ్లు. ఓ వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో ఆమె ఖాతా నుంచి రూ.34 వేలు మాయమయ్యాయి. ఇ-కామర్స్ వేదిక ‘ఓఎల్‌ఎక్స్’లో హర్షిత ఓ సోఫాను అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారుడిగా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆమెను పరిచయం చేసుకున్నాడు. సోఫా కొనేందుకు ఆసక్తి చూపాడు. బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని స్వల్ప మొత్తాన్ని ఆమెకు బదిలీ చేశాడు.
అనంతరం ఓ క్యూఆర్ కోడ్‌ను పంపి.. దాన్ని స్కాన్ చేస్తే డబ్బు ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడు. హర్షిత దాన్ని స్కాన్ చేయగా అతడి నుంచి డబ్బు రాకపోగా, ఆమె ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. ఆపై అతణ్ని మళ్లీ సంప్రదించగా.. తాను పొరపాటున వేరే క్యూఆర్ కోడ్‌ను పంపినట్లు చెప్పాడు. మరో కోడ్‌ను పంపి దాన్ని స్కాన్ చేయాలని సూచించాడు. అతడు చెప్పినట్లే చేయడంతో హర్షిత ఖాతా నుంచి మరో రూ.14 వేలు బదిలీ అయ్యాయి. ఈ మోసంపై హర్షిత పోలీసులకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.