శశికళకు రజనీకాంత్ ఫోన్.. తమిళ రాజకీయాలు కొత్త టర్న్ ?
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తమిళనాడు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళ నాలుగేళ్ల శిక్ష అనుభవించి జనవరిలో విడుదలయ్యారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన అనంతరం కొంతకాలం బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్షైర్ క్లబ్లో ఉన్నారు.
అక్కడి నుంచి బయలు దేరిన ఆమె రోడ్డు మార్గంలో ప్రయాణించి, మంగళవారం ఉదయం చేరుకున్నారు. ఆమె తమిళనాడుకు చేరుకున్న సమయంలో ఘన స్వాగతం లభించింది. ఆమె ప్రయత్నించిన కారుకు అన్నాడీఎంకే జెండా పెట్టుకోవడం విశేషం. ఆ పార్టీకి చెందిన కారులోనే శశికళ రావడంతో.. దాన్ని తొలగించేందుకు పోలీసులు సాహసం చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు ఏఐఏడీఎంకే సోమవారం ఏడుగురు పార్టీ నేతలపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే నెపంతో వారిని తొలగించింది.ఇక శశికళ తమిళనాడు అడుగుపెడుతూనే పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చింది. చిన్నమ్మకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారట. ఈ విషయాన్ని దినకర్ మీడియాకు తెలిపారు.
‘సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు’ అని దినకరన్ మీడియాకు తెలిపారు. చిన్నమ్మకు రజనీ ఫోన్ చేయడం వెనక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా ? అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టబోనని రజనీకాంత్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రజనీ కొత్త పార్టీ పెట్టడం లేదని.. కానీ, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వననిచెప్పలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.