హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్ 

“హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నా”నన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్. ఆయన పదవికాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఈ సందర్భంగా సభలో జరిగిన వీడ్కోలు ప్రసంగం ఆద్యంతం ఉద్వేగపూరితంగా సాగింది. ఆజాద్‌ సేవలను కీర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఒకానొక సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్‌ అని ప్రధానమంత్రి కొనియాడారు.

ఇక వీడ్కోలు సందర్భంగా ఆజాద్ సభ్యులందరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నా. ఇప్పటివరకు నేను పాకిస్థాన్ వెళ్లలేదు, నిజంగా నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నా. పాకిస్థాన్‌ వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. అక్కడి పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతాను అన్నారు.  కీలకమైన సమయాల్లో సభను ఎలా నడపాలి అనే విషయాలతో పాటు మరెన్నో అంశాలను మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నుంచి నేర్చుకున్నానని ఆజాద్‌ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్‌పేయీకు నివాళులు అర్పించారు.