ఇకపై వారంలో మూడ్రోజులు సెలవులు
ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై వారానికి నాలుగు రోజులు పనిచేస్తే సరిపోద్ది. మిగితా మూడ్రోజులు ఏంచక్కా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే ఆ పని చేసిన నాలుగురోజులు మాత్రం తడిసి పోనుంది. ఎందుకంటే ? ఆ నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ 12గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. అంటే.. ? వారానికి 48 గంటల పని విషయంలో ఎలాంటి మార్పు లేకుండా.. వారానికి నాలుగు రోజుల పని, మూడ్రోజుల సెలవుల విషయంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కసరత్తు చేస్తోంది.
“కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవు ఇస్తే, మిగిలిన నాలుగు రోజులు రోజుకి 12గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అనుమతితోనే ఈ మార్పులు చెయ్యాలి. ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలపై బలవంతం ఉండదు. కేవలం వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పని సంస్కృతిలో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం” అని కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.