GHMC మేయర్’గా విజయలక్ష్మీ

GHMCలో కొత్త పాలకవర్గం కొలువుదీరుతోంది. కొత్తగా ఎన్నుకోబడిన కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరగనుంది. సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్టు సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు ఉండనున్నాయి. మరికొద్దిసేపట్లో వాటిని ఓపెన్ చేయనున్నారు.

అయితే అత్యంత విశ్వసనీయ సమాచారమ్ ప్రకారం.. జీహెచ్‌ఎంసీ తెరాస మేయర్‌ అభ్యర్థిగా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేసినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా మోతె శ్రీలత పేరు దాదాపు ఖరారైంది. శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు.

భాజపా మేయర్‌, ఉప మేయర్‌ అభ్యర్థులను ఆపార్టీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు గురువారం ఉదయం ప్రకటించారు. మేయర్‌ అభ్యర్థిగా ఆర్కేపురం డివిజన్‌ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఉప మేయర్‌ అభ్యర్థిగా రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారి పేరును ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బయల్దేరే ముందు భాజపా కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు బషీర్‌బాగ్‌లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.