కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ విలువైన సూచనలు


నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, తెరాస కార్పొరేటర్లు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావొద్దు.

అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడొద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించి అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనైన సాయం చేయాలి. అబద్ధాలు చెప్పొద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని సీఎం కేసీఆర్ సూచించారు.