రివ్యూ : ఉప్పెన
చిత్రం : ఉప్పెన (2021)
నటీనటులు : వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి, విజయ్ సేతుపతి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : బుచ్చిబాబు సనా
నిర్మాతలు : మైత్రీ మూవీస్
రిలీజ్ డేటు : 12 ఫిబ్రవరి, 2021
రేటింగ్ : 3/5
కొన్ని సినిమాలకు రిలీజ్ కు ముందే హిట్ టాక్ వస్తుంటుంది. అది నిజం అవుతుంది కూడా. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కొత్త దర్శకుడు, కొత్త హీరో-హీరోయిన్ సినిమాకు కూడా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ హిట్ రావడం చాలా అరుదు. ఇప్పుడు ‘ఉప్పెన’ విషయంలో ఇదే జరిగింది. మెగాస్టార్ అల్లుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న చిత్రమిది. కృతీ శెట్టి హీరోయిన్. ఈమెకు ఇదే తొలి సినిమా. కొత్త దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. అందరూ కొత్తవాళ్లే అయినా.. వీరి వెనక మాత్రం స్టార్స్ ఉన్నారు. పెద్ద అనుభవం ఉంది. మైత్రీ మూవీస్ నిర్మించింది.
బుచ్చిబాబు.. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. సుక్కు పర్యవేక్షణలోనే ఉప్పెన తెరకెక్కింది. ఆయన సూచనలతో కొన్ని సీన్స్ రీ-షూట్ చేశారు. స్క్రీన్ ప్లేని షార్ప్ చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ సూపర్భ్ గా ప్లాన్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుందన్న భావన కలిగించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఎన్ టీఆర్.. ఇలా ప్రతి ఒక్కరు ఉప్పెనని మోశారు. ప్రమోట్ చేశారు. ఫైనల్ గా భారీ అంచనాల మధ్య ఉప్పెన ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఆ అంచనాలు నిజమయ్యాయా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
రాయుడు ( విజయ్ సేతుపతి) ఓ గ్రామ పెద్ద. ఆయన కూతురు బేబమ్మ (కృతి శెట్టి)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్). ప్రాణంగా ప్రేమించుకుంటారు. విషయం రాయుడుకి తెలుస్తోంది. దీంతో బేబమ్మని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఈ ప్రేమజంట ఇంట్లో నుంచి జంప్ అవుతుంది. రాయుడు కంటపడకుండా.. పూరి, కోల్కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఓ రోజు రాయుడికి బేబమ్మని అప్పగిస్తాడు ఆశీ. ప్రాణంగా ప్రేమించి బేబమ్మని ఆశీ ఎందుకు రాయుడికి అప్పగించాడు ? తండ్రికి అప్పగించిన తర్వాత బేబమ్మ రియాక్షన్ ఏంటీ ? అసలు.. బేబమ్మ-ఆశీల ప్రేమని రాయుడు ఎందుకు వ్యతిరేకించాడు ?? అన్నది ఉప్పెన కథ.
ఎలా సాగింది ?
ఇది పరువు-ప్రతిష్టల కథ. ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయ్. దర్శకుడు బుచ్చిబాబు కూడా రొటీన్ పరువు-ప్రతిష్టల కథనే చూపించాడు. కానీ క్లైమాక్స్ లో అసలుసిసలు టాలెంట్ చూపించాడు. విభిన్నమైన క్లైమాక్స్ ని కన్విన్సింగ్ చూపించి మనసులని దోచేశాడు. విజయ్ సేతుపతి ఎంట్రీతో సినిమాని ఆసక్తిగా మొదలెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత ఆశీ-బేబమ్మల లవ్ సీన్ తో మెల్లిన సినిమాలోకి తీసుకెళ్లాడు. తొలిభాగం స్లోగానే సాగింది. అయితే సెకాంఢాఫ్ లో దర్శకుడు తన టాలెంట్ చూపించాడు. స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు. ఆఖరి 20 నిమిషాలు అయితే సినిమా పీక్స్ లో ఉంటుంది. ఫైనల్ గా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కల్పించి ప్రేక్షకులన్ థియేటర్స్ నుంచి పంపించేశారు.
ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. మొదటి హీరో స్క్రీన్ ప్లే. సినిమాలో స్క్రీన్ ప్లే హైలైట్. రెండో హీరో విజయ్ సేతుపతి. సినిమాలో ఆయనే నిజమైన హీరో. కాకపోతే ప్రేమకథని స్పేస్ ఇవ్వాలని ఆయన పాత్రని తగ్గించారు. విజయ్ పాత్ర నిడివిని ఇంకాస్త పెంచితే ఇంకా బాగుండేది. ఇక మూడో సంగీతం, సినిమాటోగ్రఫీ. ఈ రెండు సినిమా స్థాయిని పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి.
ఎవరెలా చేశారు ?
విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఉప్పెనకు ఆస్తి ఆయనే. హీరో ఆయనే. సినిమాని నిలబెట్టారు. విజయ్ సేతుపతి లేకుండా ఈ సినిమా తీస్తే.. అట్టర్ ప్లాప్ అంతే. అంతలా సినిమాకు ప్లస్ గా మారారు ఆయన. ఇక తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి మెప్పించారు. వీరిద్దరు ఇది తొలి సినిమా అన్నట్టుగా నటించలేదు. కాస్త అనుభవం ఉన్నవారిగా నటించారు. సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు. ఇక మితిగా నటీనటులకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నంతలో అందరూ బాగానే చేశారు.
సాంకేతికంగా :
టెక్నికల్ గా ఉప్పెన టాప్ లో ఉంది. ఉప్పెన తొలి పాట ‘నీ కళ్లు నీలి సముద్రం.. ‘ తోనే సినిమాపై బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. జల జల జలపాతం నువ్వు, ఈశ్వర పాటలు కూడా చాలా బాగున్నాయి. రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. షమాదత్ అందించిన సైనుద్దీన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో హైలైట్. ఫస్టాఫ్, సెకాంఢాఫ్ లోనూ కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగింది. కొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
* స్కీన్ ప్లే
* విజయ్ సేతుపతి
* సంగీతం
* సినిమాటోగ్రఫీ
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
* రొటీన్ కథ
* అక్కడక్కడ స్లో నేరేషన్
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్ : పరువు-ప్రతిష్టల నేపథ్యంలో తెరకెక్కిన రొటీన్ ప్రేమకథ. కానీ దర్శకుడి టేకింగ్ బాగుంది. విజయ్ సేతుపతి, హీరో-హీరోయిన్ల ఫ్రెష్ నెస్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, క్లైమాక్స్ సినిమాలని నిలబెట్టాయి. ‘ఉప్పెన’ని ఓసారి చూడొచ్చు.
నోట్ : ఈ సమీక్ష వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.