అప్పులు చేయడమే అద్భుతమా ?


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 70వేల కోట్ల అప్పులు ఉన్నాయ్. దాన్ని తెరాస ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్లకి చేర్చింది. పైగా అభివృద్ది చేశామని చెప్పుకుంటోంది. అప్పులు చేయడమే అద్భుతమా ? అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. హాలియా బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ చేసిందేమీ లేదని.. ఆరేళ్లలో తెరాస అద్భుతాలు చేసిందని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తాజాగా జానారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రైతుబంధు పథకం మంచిదే. దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ.. రైతు రుణమాఫీ ఏమైందని జానా ప్రశ్నించారు.ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ముందు మంచి పనులు చేసిన కాంగ్రెస్ ని అభినందించడం నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ కు హితువు పలికారు. ఇక అతి త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి లేదంటే ఆయన తనయుడు బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.