జనసేనలో ఊపు తీసుకొచ్చిన పంచాయతీ
సినిమాల్లో పవన్ కల్యాణ్ సూపర్ హిట్. పవర్ స్టార్ గా తెలుగుతెరను ఏలుతున్నారు. కానీ పాలిటిక్స్ లో పవన్ ఇంకా హిట్ కాలేదు. సీరియస్ గా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. అయితే తొలిసారి ఏపీలో జనసేనకు ఊపొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ నే తెలిపారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పవన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి విడత పంచాయతీ ఫలితాలపై శుక్రవారం పవన్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు మొదలైనట్లు అర్థమవుతోందన్నారు. 18 శాతానికిపైగా ఓట్లతో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులని జనసేన కైవసం చేసుకుందని తెలిపారు. వెయ్యికిపైగా వార్డుల్లో విజయం సాధించామని పవన్ చెప్పారు. 1700 పైగా పంచాయతీల్లో జనసేన బలపరచిన అభ్యర్థులకు రెండో స్థానం దక్కిందని పవన్ కల్యాణ్ తెలిపారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనలో ఊపుని తీసుకొచ్చాయని పవన్ చెప్పుకొచ్చారు.
2014 అసెంబ్లీ ఎన్నికల ముందే జనసేన పార్టీని స్థాపించారు పవన్. అయితే 2014లో జనసేన పోటీ చేయలేదు. తెదేపాకు మద్దతునిచ్చింది. ఆ ఎన్నికల్లో తెదేపా గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్నాళ్ల పాటు తెదేపాతో సన్నిహిత మెలిగిన పవన్.. తర్వాత ఆ పార్టీకి దూరంగా వచ్చి ఒంటరి పోరాటంమొదలెట్టారు. 2019 ఎన్నికల్లో ఒంటిగా బరిలోకి దిగిన జనసేనకు నిరాశ ఎదురైంది. ఒకే ఒక్క సీటు మాత్రం దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. అయినా.. పవన్ ఏమాత్రం తగ్గలేదు. పొలిటికల్ ఫైట్ ని కొనసాగిస్తున్నారు. ప్రజల పట్ల పోరాటాలు చేస్తున్నారు. ప్రజలకి జనసేనని దగ్గర చేస్తున్నారు. ఆ ఫలితమే తాజా పంచాయతీ ఎన్నికల్లో కనబడిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.