కాజల్ చెప్పిన పెళ్లి తర్వాత ముచ్చట్లు.. విన్నారా ?
పెళ్లయితే హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయినట్టేనని భావించేవారు. కానీ ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది. పెళ్లైన ముద్దుగుమ్మలు కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో చూస్తే.. సమంత పెళ్లి తర్వాత కూడా రాణిస్తోంది. భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఇప్పుడీ.. ఈ జాబితాలో చందమామ కాజల్ కూడా చేరబోతుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.
వెంకట్‌ప్రభు దర్శకత్వం కాజల్ నటించిన వెబ్ సిరీస్ ‘లైవ్ టెలీకాస్ట్’ హాట్‌స్టార్ వేదికగా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్న కాజల్.. తన జీవితంలో పెళ్లి తర్వాత వచ్చిన మార్పులేంటో అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందన్నారు. వ్యాపారిగా ఆయన, సినీ హీరోయిన్‌గా తాను …తమతమ వృత్తిపరమైన జీవితాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటామన్నారు.
అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ పక్కన పెడతామన్నారు. జాలీగా గడిపేందుకు ఆఫీస్ విషయాలను, షూటింగ్ సంగతులను దగ్గరికి రానివ్వమని కాజల్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గట్టి నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. వివాహం తర్వాత తనతో గడపడానికి అప్పుడప్పుడు గౌతమ్ సెట్‌కు వస్తుంటారన్నారు. సెట్‌లో ఉన్న వారందరూ ఆయనను గౌరవించడం, ఒక కుటుంబసభ్యుడిలా చూసుకోవడం తనకెంతో సంతోషాన్నిస్తోందన్నారు. మొత్తానికి.. పెళ్లైన తొలిరోజులని భాగా ఆస్వాదిస్తున్నామని కాజల్ చెప్పుకొచ్చింది.