కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కిషన్ రెడ్డి క్లారిటీ !

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పార్లమెంటులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి.. అసద్ అనుమానాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏ ప్రాంతాన్నీ కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోమని.. హైదరాబాద్‌ సహా అన్ని నగరాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ప్రస్తావించిన అసద్.. దానికి సమాధానం వినకుండానే సభలో నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ అంశాన్ని సీఎం కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఏడేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.