పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఇటీవలే షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మరుసటిరోజు నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలు అధికార తెరాసని నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. అయితే ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థులపై కాకుండా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లపై అందరి ఫోకస్ ఉంది. చాలా త్వరగా ప్రచారంలోకి దిగిన మల్లన్న.. ఉద్యోగ, నిరుద్యోగులని తనవైపు తిప్పుకుంటున్నారు. మండలి వేదికగా ఉద్యోగ, నిరుద్యోగుల గొంతుని వినిపించేందుకు తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆ విజ్ఝప్తికి మంచి స్పందన కూడా వస్తుంది. ఈ సారి టీఆర్ ఎస్ కు తీన్మార్ మల్లన్న షాక్ ఇవ్వడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది.