కేసీఆర్ బర్త్ డే.. రాములమ్మ సటైర్లు !
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గురువారం కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెరాస శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక తెరాస ఎమ్మెల్యేలు, కీలక నేతలు రక్తదానం చేశారు. వారిని మంత్రి కేటీఆర్ దగ్గరుండి అభినందించారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మరోవైపు, కేటీఆర్ బర్త్ డే హడావుడిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు, సటైర్లు పడ్దాయ్. భాజాపా మహిళా నేత విజయశాంతి తనదైన శైలిలో సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ పై సటైర్స్ వేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పెద్ద వ్యాసమే రాసుకొచ్చారు.
“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారు. వాళ్ళు పాపం… గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని… మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా భరించాలని… గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు.
వేసవి కాలంలో నీళ్ళు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని ఆవేదన చెందారు. ఇవేవీ సర్కారుకు పట్టలేదు. సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు. గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారు. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోవణలు వెల్లువెత్తాయి.
సమయానికి జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా… బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా సర్కారు వారు నిర్లక్ష్యం వీడరు. ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్ని… నదులకు మొక్కులు, నాటి గాలికి వదిలేస్తున్న మొక్కలు… కాపాడుతున్నాయని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్లుంది. తెలంగాణ పాలకుల ఈ లెక్కలేనితనానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఎదురు చూస్తున్నారు” అంటూ రాములమ్మ రాసుకొచ్చారు.