చైనాతో భారత్ యుద్ధం తృటిలో తప్పింది

ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల వరకు భారత్‌ వెళ్లిందని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ వైకే జోషీ తెలిపారు. అయితే, యుద్ధానికి దారితీయకుండా భారత్‌ చాకచక్యంగా చైనాను నిలువరించిందని వెల్లడించారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన జోషి. గల్వాన్ ఘర్షణ తర్వాత బార్డర్ లో నెలకొన్న పరిస్థితులని వివరించారు.

“జులైలో గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరుదేశాల మధ్య ఎర్రగీత గీయాల్సి వచ్చింది. ఆగస్టు 29, 30 మధ్యరాత్రి భారత్‌ పాంగాంగ్‌ సరస్సుకు దక్షిణాన వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్‌ రేంజ్‌ను అధీనంలోకి తీసుకుంది. ఈ ఆకస్మిక చర్యతో చైనా కంగుతింది. అయితే ప్రతిచర్యకు దిగింది. ఆగస్టు 31న కైలాశ్‌ రేంజ్‌ సమీపంలోకి రావాలని ప్రయత్నించింది. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

మా ట్యాంకు మన్‌, గన్నర్ సహా అందరూ పరిస్థితులను గమనిస్తున్నారు. శత్రవుల యుద్ధ ట్యాంక్‌ అత్యంత సమీపంగా రావడంతో వారంతా అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో ట్రిగ్గర్‌ నొక్కి యుద్ధం ప్రారంభించడం చాలా సులువే. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఆపరేషన్లయినా చేపట్టేందుకు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ, చైనా దళాలపై కాల్పులు జరపకుండానే ఎదుర్కోవడం చాలా సహనంతో కూడిన క్లిష్టమైన పని. దానికి చాలా ధైర్యం, నిబద్ధత కావాలి. మన జవాన్లు అలానే వ్యవహరించారు. యుద్ధం జోలికి వెళ్లకుండా చైనాను నిలువరించగలిగాం. కానీ, ఆ సమయంలో భారత్‌ దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లింది” అని వైకే జోషీ చెప్పుకొచ్చారు.