న్యాయవాదుల హత్యపై హైకోర్ట్ కీలక ఆదేశాలు 

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోర్ట్ వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది.

మరోవైపు న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈరోజు విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరిస్తున్నట్టు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులు, నాంపల్లి, సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు, కూకట్‌పల్లి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల ఎదుట లాయర్ల ధర్నాతో ఎల్బీనగర్‌- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది.